మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం!

  • 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ
  • డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దక్కని ఆహ్వానం
  • సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • కూటమిలో క్రెడిట్ వార్‌పై శివసేన ఆగ్రహం
  • అదానీ గ్రూప్, సీఐడీసీవోలకు సీఎంవో షోకాజ్ నోటీసులు
మహారాష్ట్ర అధికార 'మహాయుతి' కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఒక హైప్రొఫైల్ కార్యక్రమ ఆహ్వాన పత్రిక వివాదం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆహ్వానించకపోవడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ విమానాశ్రయ ప్రాజెక్టును పర్యవేక్షించే 'సీఐడీసీవో' (CIDCO) సంస్థ నేరుగా షిండే మంత్రిత్వ శాఖ పరిధిలోనే పని చేస్తుండటం గమనార్హం.

అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ, సీఐడీసీవో సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గణేశ్ నాయక్, అదితి తత్కరేలు పాల్గొన్నప్పటికీ.. డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, సునేత్రా పవార్‌లను కనీసం సంప్రదించకుండా, ఆహ్వాన జాబితా నుంచి పూర్తిగా పక్కన పెట్టడం కలకలం సృష్టించింది. దీనిపై షిండే నేతృత్వంలోని శివసేన వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారని, ప్రాజెక్టు క్రెడిట్ షిండేకు దక్కకుండా చేసేందుకే ఈ కుట్ర పన్నారని రాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాత్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.

మరోవైపు ఈ వివాదం ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారింది. శివసేన (UBT) నేత అంబాదాస్ దాన్వే అధికార కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. మహాయుతిలో షిండే స్థానం ఏంటో ఈ సంఘటనతో అర్థమవుతోందని, కూటమిలో ముసలం పుట్టిందని వ్యాఖ్యానించారు. వివాదం ముదరడంతో నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తీవ్రంగా స్పందించింది. అధికారిక ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి, ఉప ముఖ్యమంత్రులను కార్యక్రమానికి దూరం పెట్టడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీఐడీసీవో, అదానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్రెడిట్ రాజకీయం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం కూటమిలో మరింత ఉత్కంఠను రేపుతోంది.

Eknath Shinde
Mahayuti Alliance
Navi Mumbai International Airport
CIDCO
Maharashtra Politics
Shivaji Maharaj Statue

More Telugu News